తెలంగాణ వీణ, హైదరాబాద్ : బీజేపీ మెనిఫెస్టో కమిటీ చైర్మన్, పెద్దపల్లి మాజీ ఎంపి గడ్డం వివేక్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపిన ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని నోవాటెల్‌లో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెన్నూరు టిక్కెట్టును కాంగ్రెస్ వంశీకి ఇచ్చేందుకు సముఖంగా వ్యక్తం చేయగా.. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్ధానాన్ని వివేక్ కు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వివేక్.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకే తాను కాంగ్రెస్ లో చేరానన్నారు. రాష్ట్రంలో.. కేసీఆర్ కుటుంబం తమ ఆకాంక్షల మేరకే పని చేస్తోందని.. కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. అయితే గత కొంతకాలంగా వివేక్ బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. గత నెల 24న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన వివేక్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను బీజేపీ నుండి పెద్దపల్లి అభ్యర్ధిగా బరిలో ఉంటాననీ స్పష్టం చేశారు. కానీ ఇటీవల బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో.. అనుచరులతో చర్చించిన వివేక్ సైతం కాంగ్రెస్ లో చేరారు.