తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ పదేపదే ప్రసంగాల్లో ప్రస్తావించే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీనవర్గాల పిల్లలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలను పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉచిత వసతి, భోజనంతోపాటుగా చేతి ఖర్చులకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందని భావించి పిల్లల్ని చేర్చితే కాస్మెటిక్ ఛార్జీలు అందక, వాటిని తల్లిదండ్రులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలకు నూనె, స్నానానికి సబ్బు, క్షవరం చేయించుకునేందుకూ ప్రతి నెలా పేద విద్యార్థులు ఇంటివైపు చూడాల్సివస్తోందని చెబుతున్నారు.
ప్రోత్సాహమేదీ..?
గురుకుల పాఠశాలలకు సంబంధించి అయిదు నుంచి పదో తరగతి విద్యార్థుల్లో బాలురకు నెలకు రూ.150, బాలికలకు రూ.200, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో బాలురకు రూ.200, బాలికలకు రూ.250 చొప్పున కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాల్సిఉంది. ఇవికాకుండా బాలురకు నెలకు క్షవరం చేయించుకునేందుకు రూ.30 అదనంగా ఇచ్చేవారు. ఇవి నాలుగేళ్లుగా విడుదల చేయడం లేదని వాపోతున్నారు.
జిల్లాలో ఇలా..
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో బీసీ సంక్షేమశాఖ పరిధిలో 9 ప్రీ మెట్రిక్, 13 పోస్టు మెట్రిక్ వసతి గృహాలున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 23 ప్రీ మెట్రిక్, 10 పోస్టు మెట్రిక్ వసతి గృహాలున్నాయి. వీటిలో సుమారు 7 వేలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరిలో బీసీ సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాల్లో విద్యార్థులకు గతేడాది వరకు కాస్మెటిక్ ఛార్జీలు అందాయి. సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల విద్యార్థులకు నాలుగేళ్లుగా అందక ఇబ్బందిపడుతున్నారు.
క్షేత్ర స్థాయిలో చర్యలేవీ..
పేద విద్యార్థుల చదువులకు ఎంతైనా ఖర్చుచేస్తామని చెబుతున్న జగన్ మామయ్య తమకు నాలుగేళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు మంజూరుకాకున్నా పట్టించుకోవట్లేదని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులపై చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఇలా..
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత 2020 ఆగస్టు నుంచి విద్యార్థి, లేదంటే తల్లి బ్యాంకు ఖాతాకు నేరుగా కాస్మెటిక్ ఛార్జీలు జమ చేస్తామని ప్రకటించింది. కిట్‌ల పంపిణీ నిలిపివేసి నగదు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఉత్తర్వులు జారీ చేశారేతప్ప ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది.