తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నిలవనుంది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్‌గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షిస్తోంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికతతో..
ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియం, మిని థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్‌ను 1500 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్ ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుపుతూ 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యంగ నిర్మాణ సమయంలోని ఛాయాచిత్రాలు, వస్తువులను ప్రదర్శించేలా మ్యూజియం ఏర్పాటవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే స్వయంగా సమాధానం ఇచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్‌్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బీహర్, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, ఏడాదిన్నరకు పైగా పనిచేశారు.