తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుంచి మాత్రమే ప్రపంచాన్ని మార్చే గొప్ప సంస్కరణలను ఆశించగలమని గ్రీకులు నమ్మేవారు. దీన్ని ఆచరణాత్మకంగా చేసి చూపించింది కేసీఆర్ సర్కారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో సంస్కరణల పేరు వింటేనే పేద, మధ్యతరగతి బిడ్డలు భయపడే దుస్థితి దాపురించింది. పేదల నెత్తిన భారం మోపడం, కాకులను కొట్టి గద్దలకు వేయడం, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం.. అనేవే గొప్ప సంస్కరణలుగా ఇప్పటి వరకు ప్రతి జాతీయ, ప్రాంతీయ పార్టీ వ్యవహరించింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనూ ఇదే జరిగింది. అయితే, ఏకపక్ష విధానాలకు, దోపిడీ పద్ధతులకు ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ సర్కారు చరమగీతం పాడింది. పేదలు, బడుగు బలహీన వర్గాల కోణంలో ఏకంగా పది విప్లవాత్మక నిర్ణయాలతో సంస్కరణలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది. అలా.. దేశానికి కొత్తదారి చూపించి, సంస్కరణలకు అడ్డాగా తెలంగాణ గడ్డ మారింది.
తెలంగాణ ప్రభుత్వం గడచిన పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది. అనేక పరిపాలనా సంస్కరణలకు సైతం నాంది పలికింది. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసి పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విధానపరమైన నిర్ణయాలను తీసుకుని ప్రజల చెంతకే పాలనను చేర్చడంతో పాటు, పారదర్శక సేవలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ సర్కారు హయాంలో పదేండ్లలో వచ్చిన 10 విప్లవాత్మక సంస్కరణలు ఏమిటో ఓ సారి చూద్దాం…
పరిపాలన
ప్రజల చెంతకే పరిపాలనను చేర్చడంలో భాగంగా కొత్తగా జిల్లాలు, ఎప్పటికప్పుడు ప్రజల డిమాండ్, అవసరాల మేరకు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఒక జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉండేలా జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను నిర్మిస్తు న్నది. అధికారుల నివాస సముదాయాలను నిర్మిస్తున్నది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సైతం క్యాంపు ఆఫీసులను నెలకొల్పింది. ఇక రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాల యాన్ని ఆధునిక హంగులతో నిర్మించింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఈ సచివాలయాన్ని తీర్చిదిద్దింది.
రవాణా
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఏపీలో 1,61,258 కిలోమీటర్ల పరిధిలో 826 బస్సులను టీఎస్ ఆర్టీసీ తిప్పే అవకాశం లభించింది. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయటపడ వేసేందుకు కార్గో సేవలను ప్రారంభించారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు రూ.20 లక్షలకుపైగా అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఆర్టీసీ ఉద్యోగుల సంరక్షణకు డిపోల వారీగా సంక్షేమ కమిటీలను నియమించారు. ఇటీవలనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ తదితర రాయితీలను కల్పిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ట్రాక్టర్, ట్రాలీలకు రోడ్ ట్యాక్స్‌ను రద్దు చేసింది.
భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ఇష్టా రాజ్యంగా రికార్డులు మార్చే సంస్కృతికి చెక్ పడింది. ఒకప్పుడు భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా, హక్కుల మార్పిడి జరగాలన్నా రోజుల సమయం పట్టేది. పైరవీలు, అవినీతికి తావుండేది. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అరగంటలోనే రిజిస్ట్రేషన్, నిమిషాల వ్యవధిలోనే మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. అవినీతికి తెర పడింది.
పట్టణ, పురపాలక శాఖ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా మరో 76 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్లు 6 మాత్రమే ఉండగా, ప్రభుత్వం మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 128కి, కార్పొరేషన్ల సంఖ్య 13కు పెరిగింది. మొత్తం పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 141కు చేరింది. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం ఆస్తిపన్ను రాయితీ ఇచ్చింది. వాటర్ బోర్డులో కూడా నీటిపై పన్నును, వడ్డీని మాఫీ చేస్తూ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరుతో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. వీధి వ్యాపారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది. పట్టణాలు, నగరాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతులకు టీఎస్‌బీపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 75 గజాల్లో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే ఇండ్లకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. 600 గజాల వరకు ఇన్‌స్టంట్ విధానంలో అనుమతులను మంజూరు చేస్తున్నది. నీటి కాలుష్య నివారణ కోసం జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎస్‌టీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వెయ్యి మందికి ఒక ప్రజా మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో కొత్తగా 4,087 ప్రజా మరుగుదొడ్లను నిర్మిస్తున్నది.