తెలంగాణ వీణ , జాతీయం : కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర తన ఎజెండా ఏమిటో వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడమే తన ముందున్న ఎజెండా అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, తనపై విశ్వాసముంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర నేతల నిర్దేశకత్వంలో గరిష్టంగా లోక్‌సభ సీట్లు గెలిచి మోదీకి మరింత మంది ఎంపీల బలం చేకూర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు.
”లోక్‌సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించడమే ప్రస్తుతం నా ముందున్న ఎజెండా. సీనియర్ నేతలంతా కలుపుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్తాను” అని విజయేంద్ర చెప్పారు. ఆనువంశిక పాలన అంటూ తమను విమర్శిస్తున్న వారికి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు గట్టి గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. 2018 కర్ణాటక ఎన్నికల్లో తన తండ్రి నియోజకవర్గమైన షికారిపుర నుంచి ఎమ్మెల్యేగా విజయేంద్ర పోటీ చేసి గెలుపొందారు. కాగా, ఎన్నికల్లో పోటీ రాజకీయాలకు తన తండ్రి యడియూరప్ప దూరంగా ఉన్నప్పటికీ పార్టీని ముందుకు తీసుకువెళ్లడమే ఆయన ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేస్తామని, అవసరమైన మార్పులు తీసుకువస్తామని చెప్పారు. కర్ణాటక నుంచి 25 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే తమముందున్న లక్ష్యమని విజయేంద్ర చెప్పారు.