తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓటుకునోటు కేసు వెంటాడుతోంది. ఘటన జరిగి సుమారు పదేళ్ళవుతున్నా కేసు మాత్రం రేవంత్ ను వదలటంలేదు. విషయం ఏమిటంటే కేసును కొట్టేయలేదు ఇదే సమయంలో విచారణ జరిపి తీర్పునూ చెప్పలేదు. సంవత్సరాల తరబడి కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతునే ఉంది. అందుకనే ఈ కేసు వదలకుండా రేవంత్ ను వెంటాడుతునే ఉంది. ఇపుడీ విషయం ఎందుకంటే కామారెడ్డి బహిరంగసభలో కేసీయార్ ప్రస్తావించటమే. కామారెడ్డిలో గురువారం కేసీయార్ నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గంలో రేవంత్ కూడా నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా కేసీయార్ మాట్లాడుతు ఓటుకునోటులో దొరికిన దొంగ తనపైన పోటీచేస్తున్నట్లు సెటైర్ వేశారు. ఓటుకు నోటు దొంగ తనపైన పోటీనా అని కేసీయార్ జనాలను ఉద్దేశించి అడిగారు. ఇదే కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ కొంతకాలం జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు. చాలాకాలంగా రేవంత్ తన ప్రచారంలో కేసీయార్ ను పదేపదే టార్గెట్ చేస్తున్న విషయం చూస్తున్నదే. కేసీయార్ తో పాటు ఆయన కుంటుంబం అవినీతిపైన రేవంత్ పెద్దఎత్తున రచ్చ చేస్తున్నారు. రేవంత్ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత గోలచేసినా అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అన్న విషయం మరచిపోకూడదు. ఆరోపణలన్నీ నిజాలైపోవు. ఆరోపణలతో కోర్టులో కేసులు వేసి వాటిపై విచారణ జరిగి కోర్టు అవినీతి జరిగిందని నిర్ధారించాలి. అప్పుడు మాత్రమే ఆరోపణలు నిజాలవుతాయి. మనదగ్గర ఎక్కువభాగం ఆరోపణలే కానీ కోర్టుల్లో నిర్ధారణ అవటం కష్టమే. అయితే రేవంత్ పైన కేసీయార్, మంత్రులు కేటీయార్, హరీష్ రావులు చేస్తున్నది ఆరోపణలు కావు నిజాలు. ఎందుకంటే కోర్టు తీర్పు రాకపోయినా ఓటుకునోటు ఇస్తు రేవంత్ వీడియోల సాక్ష్యంగా దొరికిపోయారు. కోర్టులో కేసు ఎప్పటికైనా తేలచ్చు లేదా తేలకపోవచ్చు. అయితే రేవంత్ ఓటుకు డబ్బులిస్తు దొరికిందైతే వాస్తవం. అందుకనే కేసీయార్, మంత్రులు రేవంత్ ను ఉద్దేశించి తమ ప్రచారంలో ఓటుకునోటు దొంగ అంటు పదేపదే ప్రస్తావిస్తున్నది.