తెలంగాణ వీణ , జాతీయం : రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఆయన తన సస్పెన్షన్‌పై నేరుగా రాజ్యసభ చైర్‌పర్సన్‌ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
దేశ రాజధాని ఢిల్లీ బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. దీనిపై రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.