తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నిన్న 16 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది. టిక్కెట్ దక్కని నేతల అనుచరులు నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంపై ఇతర ఆశావహులు గుర్రుగా ఉన్నారు.
టిక్కెట్ ఆశించి భంగపడిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉండగా, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ… ఆందోళన చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులకు ఫోన్ చేసి సముదాయించారు. టిక్కెట్ శ్రీనివాస్ గౌడ్‌కే ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.