తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పని చేస్తున్నారంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై ఒవైసీ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. కేవలం మతపరమైన విద్వేషం కారణంగానే రాహుల్ గాంధీ తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఒవైసీ అంటున్నారు.
గురువారం సాయంత్రం సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. ‘కర్ణాటక ఎన్నికల సమయంలో ఢిల్లీలోని నా ఇంటికి రాహుల్ ఒకరిని పంపారు. ఆ రహస్యం ఏంటో చెప్పమంటారా?.. నేనూ మీ గురించి చాలా చెప్పగలుగుతా’ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అమేథీలో ఓడిపోవడానికి బీజేపీ దగ్గరి నుంచి ఎంత తీసుకున్నారు. మీ స్నేహితులు సింధియా, జితిన్ ప్రసాదలు బీజేపీలో చేరారు. కానీ, వాళ్లెవరిపైనా డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు మీరు చెయ్యరు. ఎందుకంటే.. మీకు(రాహుల్) మేమంటే ద్వేషం’’ అని ఒవైసీ ప్రసంగించారు.