Thursday, December 26, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్లేస్‌ ఏదైనా విజయం మాత్రం వీళ్లదే.. 

Must read

 తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాజకీయాల్లో పరిచయాలే పెట్టుబడి. ఎన్నో ఏండ్లు కష్టపడితేనే రాజకీయాల్లో ఎదిగేది. అన్నీ అనుకూలిస్తే ఎమ్మెల్యే కావొచ్చు. పరిచయాల్ని నిలబెట్టుకున్నంత కాలం లీడర్‌గా నిలదొక్కుకోవచ్చు. ఎన్నికల్లో నిలబడొచ్చు. అన్నీ కలిసొస్తే గెలవొచ్చు. అందుకే కొంతమంది లీడర్లు ఉన్న చోటనే ఉండిపోతారు. కొత్త చోటికి పోవాలంటే భయపడతారు. కానీ, కొందరే ఉంటారు. ఎక్కడైనా, ఎప్పుడైనా నేను రె‘ఢీ’ అంటారు. నియోజకవర్గం ఏదైనా గెలుపు మాదేనని చాటుకుంటారు. అలాంటి మడమ తిప్పని నేతలు చరిత్రలోనే కాదు సమకాలీన రాజకీయాల్లోనూ ఉన్నారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు

కేసీఆర్‌ 1985 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించారు. 1989, 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2001 (ఉప ఎన్నిక) ఆ తర్వాత 2004 ఎన్నికల్లో గెలిచారు. 2014 గజ్వేల్‌ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోనూ గజ్వేల్‌ నుంచే గెలిచారు. మూడోసారీ అక్కడే పోటీ చేస్తు న్నారు. గజ్వేల్‌లో మూడో సారి గెలిస్తే రెండు నియోజకవర్గాల్లో హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా రికార్డు సొంతమవుతుంది. కామారెడ్డి నియోజక వర్గంలోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో గెలిచి, అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తే మూడు శాసన సభా నియోజక వర్గాల నుంచి శాసన సభలో ప్రాతినిధ్యం వహించిన నేతల జాబితాలో కేసీఆర్‌ పేరు చేరుతుంది

కొప్పుల ఈశ్వర్‌

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శాసన సభకు 2009 నుంచి ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు మేడారం (ఎస్సీ) నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2008 (ఉప ఎన్నిక)లో మేడారంలో గెలుపొందారు. ధర్మపురి (ఎస్సీ)లో పోటీ చేశారు. 2009 నుంచి నాలుగు సార్లు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో ఓటమే చవిచూడలేదు. ఆరుసార్లు విజయం సాధించిన ఈశ్వర్‌ ఏడోసారి విజయం కోసం ధర్మపురిలో మళ్లీ బరిలోకి దిగారు.

ఎర్రబెల్లి దయాకర్‌ రావు

ఎన్నికల రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం నిలబెట్టుకోవడం కత్తి మీద సామే! మార్పు మంచికేనని అధికార పార్టీలను మార్చే పరిస్థితుల్లో ఎదురుగాలికి నిలిచి గెలిచేవారుంటారు. అనుకూల పవనాలను, ఎదురు గాలుల్లోనూ ఎదురేలేని గెలుపు సాధించిన వాళ్లలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఒకరు. ఆయన మొదట వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో మూడుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి రెండు నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్‌ సాధించిన నేతగా రికార్డు నెలకొల్పారు ఎర్రబెల్లి.

సబితా ఇంద్రారెడ్డి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరం నియోజక వర్గంలో 2009, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2000 (ఉప ఎన్నిక), 2004 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. అయిదో విజయం కోసం ఇప్పుడు మహేశ్వరంలో పోటీపడుతున్నారు.

బాజిరెడ్డి గోవర్ధన్‌

ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, గెలుపొందారు బాజిరెడ్డి గోవర్ధన్‌. ఆర్మూర్‌ నుంచి 1999లో గెలుపొందారు. 2004లో బాన్సువాడలో.. 2014, 2018 ఎన్నిక ల్లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి గెలుపొందారు. హ్యాట్రిక్‌ కోసం పోటీ పడుతున్నారు.

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రస్తుతం సనత్‌ నగర్‌ నియోజక వర్గంలో హ్యాట్రిక్‌ కోసం పోటీ పడుతున్నారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్‌ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించారు.

దానం నాగేందర్‌

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మొదట అసిఫ్‌నగర్‌ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994, 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, అక్కడ హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2018లోనూ గెలుపొందారు.

సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 1994లో పాలేరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ప్రస్తుతం మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం శాసన సభా స్థానం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. తర్వాత 2004 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వరుసగా విజయాలు సాధించారు.

పద్మాదేవేందర్‌ రెడ్డి

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి 2004లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రామాయంపేట నియోజక వర్గంలో గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణలో రామాయంపేట నియోజకవర్గం రద్దయింది. అప్పటి నుంచి మెదక్‌ నియోజక వర్గంలో ఆమె పోటీ చేసి గెలుపు సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలోకి దిగుతున్నారు.
.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you