తెలంగాణ వీణ , పటాన్చెరువు : కాంగ్రెస్‌లో టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ప్రకటించిన మూడో జాబితా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అగ్గి రాజేసింది. ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పోస్టర్లు, బ్యానర్ల కాల్చేశారు. పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
గత తొమ్మిదేండ్లుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న కాటా శ్రీనివాస్‌ను కాదని మధుకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ 80 వేల ఓట్లు తెచ్చుకున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా రాజకీయ ప్రలోభాలకు లోనై కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.