తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ నేతలు అన్నివేళల ప్రజల మధ్య కనిపించరని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం గంగిరెద్దులోలె వస్తరని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అట్ల వచ్చే కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ బుధవారం కథలాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరోసారి గెలిపిస్తే మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కొత్తగా మరో నాలుగైదు అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకురాబోతున్నామని చెప్పారు.
‘సభకు చాలా పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. మీ దీవెనలు ఉంటే, ముఖ్యంగా ఆడబిడ్డల దీవెనలు ఉంటే కేసీఆర్ తప్పకుండా మూడోసారి ముఖ్యమంత్రి అయితరు. సభకు వచ్చిన మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు వస్తరు. ఇప్పుడు కూడా వాళ్లు కాకిరిబీకిరి లొల్లివెట్టుకుంట తిరుగుతున్నరు. మీరు వాళ్ల మాటలు నమ్మొద్దు. బాగా ఆలోచించి మనకు ఎవరు మంచి చేసిండ్రు..? ఇంకా ఎవరు మంచి చేయగలుగుతరు..? అని ఆలోచించి ఓటేయండి’ అని మంత్రి కేటీఆర్ సూచించారు.