తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటన. ప్రచారానికి వెళ్లిన సందర్భంలో పట్టపగలే.. అందరూ చూస్తుండగానే.. కరచాలనం చేసేందుకు వస్తున్నట్టు వచ్చి ఒక్కసారిగా కత్తితో పొడిచిన ఈ ఘటనలో.. కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో గాయమైంది. మూడించుల మేర కత్తి లోపలికి దిగినట్టు వైద్యులు తెలిపారు. చిన్నపేగు నాలుగు స్థానాల్లో దెబ్బతిందని వైద్యులు వెల్లడించారు. దీంతో.. ఆయనకు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు సర్జరీ నిర్వహించి.. సుమారు 15 సెంటీమీటర్ల పొడవు చిన్నపేగును తొలిగించారు. అయితే.. బయట నుంచి చూస్తే చిన్నగాయంగా కనిపించినా.. కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డికి కాస్త ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నట్టు తెలిపిన వైద్యులు.. ఆయనను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కనీసం 15 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగినప్పటి నుంచి ఆయన అభిమానులు.. బీఆర్ఎస్ శ్రేణులు.. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనను చూసేందుకు మెదక్, దుబ్బాక, సిద్ధిపేట ప్రాంతాలను నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. అయితే.. ఆయనను ఇంకా ఐసీయూలోనే ఉంచటం వల్ల ఎవరినీ చూసేందుకు అనుమతించట్లేదు. అందులోనూ.. ఇన్ఫెక్షన్ లక్షణాలు కూడా కనిపించటంతో.. మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. బయటి వ్యక్తులను వైద్యులు అనుమతించకపోవటం గమనార్హం. అయినా సరే.. శ్రేణులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తిప్పలు పడుతున్నారు.
తన కార్యకర్తలు తన కోసం పడుతున్న తిప్పలు తెలుసుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఐసీయూ బెడ్ మీది నుంచే.. వీడియో మెస్సేజ్ ఇచ్చారు. “భగవంతుని ఆశీస్సులతో.. మీ ఆశీర్వాదంతో.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డా. కొద్దీ రోజుల్లోనే మీ ముందుకి తిరిగి వస్తా. దయచేసి నన్ను చూడడానికి హాస్పిటల్‌కి రాకండి. వచ్చి మీరు ఇబ్బంది పడకండి. ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నా.. కాబట్టి ఆస్పత్రి సిబ్బంది ఎవ్వరినీ లోపలికి పంపించరు. అందుకే ఎవ్వరూ హైదరాబాద్ రాకండి. త్వరలో నేనే వస్తా.. థ్యాంక్యూ.” అంటూ ఆస్పత్రి బెడ్ మీద నుంచే కార్యకర్తలకు కొత్త ప్రభాకర్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు.