తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్‌లో కష్టపడేవాడికి విలువ లేదు. పారాచూట్ లీడర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ నాకు వస్తుందని ఆశించా. మెదక్‌లో తన కొడుకుకు సీటు ఇవ్వలేదనే స్వార్థంతో మైనంపల్లి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాడు. నా సీటు తను లాక్కున్నాడు. ఈ రెండు కారణాల వల్ల కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పా.
రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.. దీనిపై మీ కామెంట్?
అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. కాదని చెప్పే దమ్ము రేవంత్‌కు లేదు. నేను 30 ఏండ్లుగా కాంగ్రెస్‌కు సేవలు చేశా. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశా. నన్ను కాదని మొన్న పార్టీలో చేరిన మైనంపల్లికి టికెట్ ఇచ్చాడంటే… అమ్ముకున్నట్టే కదా!
మీకు అవకాశం రాలేదని పార్టీ మారారా! ఇంకా మరేదైనా కారణాలు ఉన్నాయా?
కాంగ్రెస్‌లో ఎంతసేపూ అగ్రవర్ణాల ఆధిపత్యమే! బీసీ నాయకులను ఆ పార్టీలో ఎదగనివ్వరు. ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తుంటే చూస్తూ, ఊరుకోలేకపోయా! నందికంటి శ్రీధర్ ఒక్కడే కాదు.. చాలామంది బీసీ నేతలు అవమానాలు ఎదుర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నేతపై మీడియా సమక్షంలో రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడటం మీరూ చూశారు. ఇక ఇంటర్నల్‌గా బీసీలకు ఎలాంటి గౌరవం దక్కుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు! అంతెందుకు పొన్నం ప్రభాకర్, మధుయాషీ గౌడ్ తదితర బీసీ నాయకుల పేర్లు రెండో జాబితాలో ఇచ్చారంటే కాంగ్రెస్‌కు బీసీలపై ఏ పాటి గౌరవం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
మీకు కాంగ్రెస్ మీద నమ్మకం పోయిందా? రేవంత్ రెడ్డి మీదా..
కుటుంబానికి దూరంగా ఉండి, డబ్బులు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా. అలాంటి మాకు అవకాశం ఇవ్వకుండా, ఎదగనివ్వకుండా చేయడం మనస్తాపానికి గురి చేసింది. అదే బీఆర్‌ఎస్‌లో అయితే.. కష్టపడ్డవారికి ఉన్నత స్థానం, గౌరవం ఇవ్వడం నాకు నచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలకు పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది.
మల్కాజిగిరి ప్రభావం బీఆర్‌ఎస్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారా?
నందికంటి శ్రీధర్ ప్రభావం ఎంత ఉంటుందన్న విషయం పక్కన పెడితే.. మలాజిగిరి ప్రజలకు ఆలోచన ఎకువ. ఎవరిని గెలిపించాలి. ఎవరికి ఓటేయాలి. అనే విషయంలో వారికి ఫుల్ క్లారిటీ ఉంటది. ప్రజలకు నా మీద ఉన్న నమ్మకాన్ని, బీఆర్‌ఎస్‌కు ఓటేయాల్సిన అవసరాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తా. మైనంపల్లిని ఓడించేందుకే నందికంటి శ్రీధర్ పనిచేస్తడు. మర్రి రాజశేఖర్ రెడ్డి మలాజిగిరిలో గెలుస్తుండు. ఇందులో మార్పులేదు.