తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ సభలు, సమావేశాలతో కదనరంగంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఆయన పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి 5.25 గంటలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ పయనమవుతారని పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి.
ఇదిలావుండగా బీసీ ఆత్మగౌరవ సభను బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నేటి సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పలువురు బీసీ నేతలు ఈ సభలో పాల్గొంటారు.