తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకొని, కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా కీలకమైన ఎన్నికల్లో షర్మిల తమతో రావడం శుభపరిణామం అన్నారు.
గత హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చారని ఆరోపించారు. దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ.17 వేల కోట్లు కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. కనీసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు… ఇది ఏమయింది? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయన్నారు. పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బలహీనమైన వర్గ ప్రజలు ఏమైనా పర్వాలేదని భావిస్తోందన్నారు. దళిత ముఖ్యమంత్రి అని నమ్మబలికి కేసీఆర్ మోసం చేశారన్నారు. రాజ్యాధికారం కోసం కేసీఆర్ ఎన్ని లక్షలమంది జీవితాలతో ఆడుకుంటారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ కోసం కన్న కలలు బీఆర్ఎస్ పాలనలో నెరవేరలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ కలలు నెరవేరుస్తుందన్నారు.