తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు కాలిపోయిన ఘటనపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు కారణాలను వివరించారు.
ఈ అగ్నిప్రమాదంతో యూట్యూబర్ నాని (లోకల్ బాయ్ నాని)కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం ఈ కేసులో నిందితులు అని వెల్లడించారు. వాసుపల్లి నాని ఫిషింగ్ బోట్లలో కుక్ గా పనిచేస్తుంటాడని, సత్యం వాచ్ మన్ గా పనిచేస్తుంటాడని తెలిపారు.
ఘటన జరిగిన రోజున వాసుపల్లి నాని, సత్యం సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం తాగేందుకు ఫిషింగ్ హార్బర్ వద్దకు వచ్చారని, అల్లిపల్లి వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన బోటులో మద్యం తాగుతూ, చేపల వేపుడు చేసుకుని తిన్నారని వివరించారు. అయితే, మద్యం మత్తులో సిగరెట్లు తాగుతూ, వాటిని ఆర్పకుండానే పక్కనున్న బోటుపై విసిరారని, ఆ సిగరెట్లు బోటు ఇంజిన్ పై పడడంతో మంటలు చెలరేగాయని వెల్లడించారు.