తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో జరిగింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ఈ రోజు చాలా సంతోషంగా ఉందని, తనకు పాతమిత్రుడైన కాసాని ఎప్పుడో పార్టీలోకి రావాల్సిందని, కాకపోతే కాస్త ఆలస్యమైందని అన్నారు. బండ ప్రకాశ్‌తో పాటు కాసానికి సముచితం స్థానం కల్పించేవాడినని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్‌లోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.
రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రభుత్వపరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈటల రాజేందర్ వంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసాని, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.