తెలంగాణ వీణ, సినిమా : తొలితరం బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు దగ్గరైన ఝాన్సీ ఆ తర్వాత సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం ఇటు బుల్లితెర, అటు సినిమాలకు కాస్తంత దూరంగా ఉన్న ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ విషాదకర పోస్టు పెట్టారు. తన వద్ద పనిచేసే శ్రీను అనే వ్యక్తిగత సహాయకుడు (పర్సనల్ సెక్రటరీ) 35 ఏళ్ల చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని చెబుతూ విచారం వ్యక్తం చేశారు. శ్రీను, శ్రీనుబాబు అని తాను అతడిని ముద్దుగా పిలుచుకునేదానినని, అతడే తన మెయిన్ సపోర్ట్ సిస్టం అని పేర్కొన్నారు. తన వద్ద హెయిర్ స్టైలిస్ట్‌గా చేరి పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడని తెలిపారు. సున్నిత మనస్తత్వం కలిగిన శ్రీను తన స్టాఫ్ కంటే ఎక్కువని, తనకు తమ్ముడు లాంటివాడని పేర్కొన్నారు. అతడు తన బలమని, అతడే తన ఉపశమనమని తెలిపారు. గ్రాడ్యుయేట్ అయిన అతడు తన పనులను చక్కగా నిర్వర్తించేవాడని ప్రశంసించారు. తానిప్పుడు చాలా బాధలో ఉన్నానని, మాటలు కూడా రావడం లేదన్నారు. జీవితం ఒక బుడగలాంటిదని చెబుతూ ముగించారు. ఈ పోస్టు చూసిన వారు అతడి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.