తెలంగాణ వీణ , దుబ్బాక : దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ దాడితో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణ జనుల మనసు గతంలోకి తొంగిచూసింది. అధికారం కోసం, ఓట్ల కోసం, ఎన్నికల కోసం.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైన విద్యే. కుర్చీల వేటలో అది నెత్తుటి వేట కొనసాగిస్తుంది. 1990లో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం..
ఆ రోజు… 1990 డిసెంబర్ 7.. పాతబస్తీలో అల్లర్లు.. నగరమంతా పుకార్లు.. రాష్ట్రమంతా అలజడి.. గంగా-యమున తహజీబ్ సంస్కృతికి నిలువుటద్దంలా ఉన్న హైదరాబాద్ నరమేధంతో నిలువునా వణికిపోయింది. మర్నాడు సూర్యుడు ఉదయించేసరికి.. రాజధాని రక్తసిక్తమైంది. ఆనాడు అల్లరిమూకలు సృష్టించిన నరమేధంలో సుమారు 300 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐదారువందల మందికి గాయాలయ్యాయి. ఏకంగా 25 రోజుల పాటు హైదరాబాద్ కర్ఫ్యూ చెరలో బందీగా మిగిలింది. డిసెంబర్ చలిలోనూ నగరమంతా వేడెక్కింది. ఆ వేడి రాష్ట్రమంతా సెగలు కక్కింది. సున్నితమైన ప్రాంతాల్లో నెల రోజులు దినదిన గండంగా గడిచాయి.
ఆ మరకలను తుడిచేసిన సీఎం కేసీఆర్..
యథా రాజా… తథా ప్రజా అని ఊరికే అనలేదు. పాలకుల చిత్తశుద్ధికి అనుగుణంగా పరిపాలన విధానం కొనసాగుతుంది. అందుకే హైదరాబాద్ నగర ప్రస్థానం తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత అనే రీతిలో కనిపిస్తున్నది. నగరంలో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చనే భయం నుంచి దేశంలోనే అత్యంత ప్రశాంతమైన, సురక్షితమైన నగరం హైదరాబాద్ అని అంతర్జాతీయ ఖ్యాతికి ఎదిగింది. 2014 నుంచి ఇప్పటివరకు నగరంలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడా కూడా కల్లోలాలు చెలరేగిన దాఖలాలు లేవు. హైదరాబాద్ చరిత్రలో వరుసగా పదేండ్లలో ఒక్క క్షణం కూడా కర్ఫ్యూ విధించని సరికొత్త రికార్డును కేసీఆర్ ప్రభుత్వం లిఖించింది. వాస్తవానికి పెట్టుబడులు పెట్టాలంటే అంతర్జాతీయ కంపెనీలు ప్రప్రథమంగా పరిశీలించే కొలమానం… శాంతిభద్రతలు. అవి సంతృప్తికరంగా ఉంటేనే ఆపై మౌలిక వసతులు, భౌగోళిక అనుకూలతలు ఇలా ఇతర అంశాల గురించి ఆలోచిస్తారు. నగరంలో శాంతిభద్రతలు పక్కాగా ఉండబట్టే విదేశాల నుంచి ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు రెక్కలు కట్టుకొని వచ్చి హైదరాబాద్‌లో వాలుతున్నాయి. పాలకుడు మత సామరస్యాన్ని కాపాడటంతో పాటు పటిష్టమైన శాంతిభద్రతలను నిర్వహిస్తున్నందునే… ప్రజలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందుకు ఉదాహరణగా… గతనెల 28వ తేదీన గణేష్ నిమజ్జనంతో పాటు అదేరోజు మిలాద్-ఉన్-నబీ కూడా వచ్చింది. రెండు పర్వదినాలూ ఒకేరోజు జరగడం ఇబ్బందిగా ఉంటుందని గుర్తించిన ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ ఊరేగింపును వాయిదా వేసుకొని మతసామరస్యానికి హైదరాబాద్ నిలయమని మరోసారి రుజువు చేశారు.
ప్రశాంత తెలంగాణపై ‘కత్తి’..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. పదేండ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం ఇవే తప్ప సామాజిక, మత, రాజకీయ ఘర్షణలు చోటుచేసుకోలేదు. ఈ దశాబ్దిలో రెండేసి సార్లు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ఇతర ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ సహా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి సంఘటనలు జరగలేదు. కానీ, తాజా ఎన్నికల్లో మాత్రం హింసా మార్గానికి ద్వారాలు తెరుచుకోవడం ఆందోళన కలిగించే పరిణామం. వాస్తవానికి తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడా కనిపించదు. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలోనూ వ్యక్తిగత దాడులకు పాల్పడిన సందర్భాల్లేవు. కానీ, సోమవారం దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎన్నడూ చూడని విష సంస్కృతి మళ్లీ పురుడు పోసుకోవడం అందరినీ ఆలోచింపజేస్తున్నది. ఎన్నికల పోరులో భాగంగా ప్రతి కార్యకర్తను ప్రజాక్షేత్రంలో ఒక సైనికుడిగా మార్చాల్సిన నేతలు ఇలా భౌతిక దాడులకు పాల్పడే రీతిలో పురిగొల్పడం ప్రమాదకరమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.