తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి, దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ మూడేళ్లుగా తిరుగుతోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో గోడదూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు సంచరిస్తుండగా రికార్డయిన సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేసిన పోలీసులు ప్రజలన అప్రమత్తం చేశారు.