తెలంగాణ వీణ , హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ మీద ఇకపై కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా ప్రత్యేక సందర్భం ఏదైనా హైదరాబాద్ వాసులు ట్యాంక్‌బండ్‌కు పరుగులు తీస్తుంటారు. అక్కడ అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేసి పార్టీ చేసుకుంటుంటారు. కేరింతలు, ఫొటోలు, సెల్ఫీలతో నానా హంగామా చేస్తుంటారు. అయితే, ఇలాంటి వేడుకల కారణంగా చుట్టుపక్కల పరిసరాలు కలుషితం అవ్వడమేకాకుండా.. రోడ్డుపై వెళ్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ జీహెచ్‌ఎంసీకి, పోలీసులకు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామని.. పరిసరాల్లో చెత్తాచెదారం వేస్తే బారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.