తెలంగాణ వీణ, కాప్రా: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పైపైకి పెరిగిందని తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సైన్యం అధికమయిందని,యువతను మోసం చేసిన బీఆర్ఎస్ ను ఇంటికి పంపేందుకు ఓటుతో తెలంగాణ యావత్తు యువత సిద్ధంగా ఉన్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా ప్రకటించారు. హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్ లో నిర్వహించిన ఏఐవైఎఫ్ సమావేశం జరిగిందన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత లోపభూయిష్ట విధానాల కారణంగా ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలో నానాటికి దిగజారిపోయిందని వారు విమర్శించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిందని, యువతకు ఉపాధి కల్పన కల్పించకుండా అన్ని విధాలుగా మోసం చేశారని వారు ఎద్దేవా చేశారు.అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ లో నిరుద్యోగ రేటు అధికమని 36.2 % ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంచా ల్సిన అవసరం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యపు పోకడలను అనుసరిస్తూ నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్రంలో 52% మంది యువతకి ఉద్యోగాలు లేవని, కొత్త ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. 2014-23 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోయారని.గత తొమ్మిదేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6% ఉందని, ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34% ఉందని అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నిరుద్యోగ అభ్యర్థుల ఆశలకు గండిపడిందని, దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ తీరేనని వారు విమర్శించారు.అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించడానికి రాష్ట్ర యువత సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.సత్య ప్రసాద్ పాల్గొన్నారు.