తెలంగాణ , జాతీయం : మూడేళ్ల బాలుడు ఇంటిముందున్న ట్రాక్టర్ ఆడుకుంటున్నాడు.. గేర్ మార్చడంతో కదిలిన ట్రాక్టర్ సమీపంలోని బావిలో పడిపోయింది. ట్రాక్టర్ తో పాటే బాలుడు కూడా పడిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమకిక బాబు లేనట్లేనని గుండెలు బాదుకున్నారు. అయితే ఈ ఘటనలో మిరాకిల్ చోటుచేసుకుంది. బావిలో పడ్డ బాలుడు ఒంటిపై చిన్న గీత కూడా లేకుండా బయటపడ్డాడు. ట్రాక్టర్ నుజ్జునుజ్జుగా మారినా బాబుకు మాత్రం చిన్న గాయం కూడా కాకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని శివపురి సమీపంలోని లంగూరి గ్రామంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ బలరాం పాల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవాబ్ జాతవ్ తమ ట్రాక్టర్ ను ఇంటికి సమీపంలో పార్క్ చేశాడు. నవాబ్ ఇద్దరు పిల్లలు మూడేళ్ల అన్షుల్, సుహాని ట్రాక్టర్ పైకెక్కి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో గేర్ రాడ్ మార్చడంతో ట్రాక్టర్ కదిలింది. ఇది గమనించి నవాబ్ పరుగెత్తుకెళ్లి సుహానిని కాపాడాడు. అన్షుల్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగానే ట్రాక్టర్ వెళ్లి దగ్గర్లోని నీళ్లు లేని బావిలో పడింది.