తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరిపోతున్నాడు.. ఏ పార్టీ ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటోంది, ఎప్పుడు కటీఫ్ చెప్తోంది.. అన్న విషయాలు తెలియటం చెప్పటం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పటం చాలా కష్టంగా మారింది. అయితే.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అచ్చంగా సరిపోయే డైలాగులతో ఘాటు ట్వీట్లు చేస్తూ.. సంచలనం చర్చకు తెరలేపుతున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిన్ననేమో.. నిచ్చితార్థం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి గానీ.. అబ్బాయి గానీ దొరికితే లాగేస్కుని పోవడం మనుషుల జీవితాల్లో అక్కడక్కడా జరగుతున్న సందర్భాలు ఉంటుండొచ్చు కానీ.. మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కుడా అదే పరిస్థితి ఉంటే ఎలా?.. అంటూ సంచలన ట్వీట్ చేశారు. కాగా.. ఇప్పుడు మరోసారి.. వేశ్యకు కూడా ఒక నీతి ఉంటుంది స్వామి.. అని కన్యాశుల్కంలో మధురవాణి చెబుతుందని.. మరి తాజా రాజకీయాలలో..??? అంటూ ఘాటు ట్వీటే వేశారు నారాయణ.
అయితే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్లతో దోస్తీ కట్టేందుకు ఆసక్తి చూపించింది. ఈ మేరకు పలు మార్లు భేటీ కూడా అయ్యారు. అంతా ఓకే కానీ.. టికెట్ల విషయంలో మాత్రం కామ్రేడ్లకు, కాంగ్రెస్ నేతలకు మధ్య పొసగటం లేదు. దీంతో.. ఇప్పటికే ఈ దోస్తీ నుంచి సీపీఎం నేతలు తప్పుకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించటమే కాదు.. 17 మంది అభ్యర్థులతో తొలి జాబితా కూడా విడుదల చేశారు. అయితే.. సీపీఐ స్టాండ్ కూడా అదేనని వార్తలు వస్తున్నా.. అధికారికంగా ఇంకా ప్రకటించకపోవటం గమనార్హం. ముందుగా తాము డిమాండ్ చేసిన స్థానాల నుంచి టికెట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిన హస్తం పార్టీ.. ఆ తర్వాత ససేమిరా అంటోంది.