తెలంగాణ వీణ , హైదరాబాద్ : నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేయొచ్చు. మరోవైపు ఎక్కువమంది తిథుల ప్రకారం ఈనెల 7, 9 తేదీల్లోనే నామినేషన్ వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి
శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది.
నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు
►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ
►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ
►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి
►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి
►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి.
►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి
►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం
►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి
►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO
►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO
►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు
►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు