తెలంగాణ వీణ . ఏపీ బ్యూరో : జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు.
విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం – ఎంపీ బెల్లాన
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.
గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా… నిలిచేది జగన్ అజెండా – కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి
కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు.