తెలంగాణ వీణ ,హైదరాబాద్ : కాంగ్రె్‌సలో వైఎస్సార్‌టీపీని విలీనం చేసే ప్రతిపాదనను ఆ పార్టీ అధినేత్రి షర్మిల విరమించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచీ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా ప్రకటించినట్లుగానే పాలేరు నుంచే పోటీ చేసేందుకు ఆమె సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తరఫున పోటీకి ఆసక్తిగా ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఈ నెల 9 నుంచి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ మేరకు షర్మిలనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తామన్న నినాదంతో వైఎస్సార్‌టీపీని ప్రకటించిన షర్మిల.. రాష్ట్ర వ్యాప్తంగా 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. కాంగ్రె్‌సలో వైఎస్సార్‌టీపీ విలీన ప్రతిపాదన తెరపైకి వచ్చాక.. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అధిష్ఠానం పెద్దలు, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చలు జరిగాయి.
స్థూలంగా కాంగ్రె్‌సలో వైఎస్సార్‌టీపీని విలీనం చేయాలని షర్మిల సైతం భావించారు. అయితే, ఆమె తెలంగాణ స్థానికతను కోరుతుండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకించారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు షర్మిలను తెలంగాణ కాంగ్రె్‌సలో చేర్చుకుంటే అదే పరిస్థితి పునరావృతమవుతుందని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రె్‌సలో వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబరు 30 కల్లా విలీనం సంగతి తేలకుంటే.. ఎన్నికల బరిలోకి దిగుతామని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో షర్మిల స్పష్టంచేశారు. అయితే సునీల్ కనుగోలు జోక్యంతో నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కావడంతో వైఎస్సార్‌టీపీ తరఫున 119 స్థానాల్లోనూ అభ్యర్థులను రంగంలోకి దింపాలని షర్మిల నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లోనే విలీనం సంగతి తేల్చకుంటే తన దారి తాను చూసుకునేందుకు షర్మిల సమాయత్తమవుతున్నారు.