తెలంగాణ వీణ , యాదాద్రి : యాదాద్రి వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్. ఈనెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. చంద్రగ్రహణానికి ముందు రోజు అంటే 27వ తేదీన రాత్రి 7గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.చంద్రగ్రహణం సందర్భంగా 28న సాయంత్రం 4గంటలకు ఆలయాన్ని మూసివేసి..29వ తేదీ తెల్లవారుజామున 5గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరవనున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు అయిన శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట నరసింహస్వామి ఆలయం కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తుందని ఈనెల 28న అర్ధరాత్రి 1.06గంటలకు ప్రారంభం అయి…2.22గంటల వరకు గ్రహణం ఉంటుందన్నారు.