తెలంగాణ వీణ , హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చేయాలని లేదంటే తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సహా పలువురునేతలు పేర్కొన్న సందర్భంలో తమకు ఎవరి అవసరంలేదని చెప్పిన చరిత్ర తమ పార్టీకి ఉన్నదని పేర్కొన్నారు. కేటీఆర్ మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సమర్థత నిరూపించుకున్నారని, ఒకవేళ కేటీఆర్‌ను సీఎం చేయాలని అనుకుంటే అది బీఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్‌కు సంబంధించిన విషయమని స్పష్టంచేశారు. కేటీఆర్‌ను సీఎం చేయాలంటే తమ పార్టీకి మోదీ అనుమతి ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణను దేశానికి రోల్‌మాడల్‌గా నిలిపిన సీఎం కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోదీ రాజకీయ చరిత్ర అంతా అబద్ధాల చరిత్రేనని ‘మింట్’ సహా పలు పత్రికల్లో వచ్చిన వ్యాసాలను ప్రదర్శించారు
రేవంత్‌రెడ్డితో లోపయికారీ ఒప్పందం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో బీజేపీ లోపాయికారీ ఒప్పందం కుదర్చుకున్నదని, ఈ నేపథ్యంలోనే రేవంత్‌పై ఈడీ దాడులు జరగడం లేదని శ్రవణ్ ఆరోపించారు. ఆరెస్సెస్, ఏబీవీపీ, బీజేపీతో సత్సంబంధాలు ఉన్న రేవంత్‌ను మోదీ, అమిత్‌షా కూడబలుక్కొని కాంగ్రెస్‌లోకి పంపారని, అందుకే బీజేపీ నేతలకు వంతపాడుతున్నారని విమర్శించారు. మోదీ చెప్పేవి అబద్ధాల మాటలు అయితే, రేవంత్‌వి పిచ్చిపట్టిన మాటలను ఎద్దేవా చేశారు.
వార్డు స్థాయికి దిగజారిన మోదీ : కర్నె ప్రభాకర్
ప్రధాని హోదాలో ఉన్న మోదీ వార్డు సభ్యుడిస్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. అధికార యావతో మోదీ నీతిబాహ్యమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఎదుగుతున్నారని, దక్షిణాది నుంచి కేసీఆర్ బయలుదేరితే తమ ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించే మోదీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో తానెక్కడ వెనుకబడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ కూడా లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్, బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.