తెలంగాణ వీణ , జాతీయం : రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల్లో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. సీటు దక్కించుకోవడానికి నాయకుల అలకలు బయటపడుతున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన పలు సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజేతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు గౌర్హాజరైన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో చిత్తోఢ్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నేరాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిపిందని ఆరోపించారు. సీఎం అశోక్ గహ్లోత్ హయంలో రాష్ట్రంలో అల్లర్లు, రాళ్లదాడులు, మహిళలపై ఆకృత్యాలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఇందుకే ఓటేశారా..? అని ప్రశ్నించారు.
బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు చెలరేగుతున్న క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు..’ బీజేపీకి ముఖచిత్రం కమలమే. ప్రజలు కమలాన్ని మాత్రమే చూస్తారు. బీజేపీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజస్థాన్ అభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుంది.’ అని అన్నారు. ఈ మేరకు చిత్తోఢ్‌లో రూ.7000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.