తెలంగాణ వీణ , హైదరాబాద్ : అధికార బీఆర్‌ఎస్ పోలీసులు, ప్రభుత్వ విభాగాలను ప్రతి ఎన్నికల్లోనూ అనుకూలంగా పనిచేయించుకొంటోంది. రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై మాకు భరోసాలేదు. మునుగోడు ఉప ఎన్నికలో రూ.వందల కోట్ల డబ్బు, మద్యం ఏరులై పారినా ఇక్కడి ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం కట్టడి చేయలేకపోయింది. ఆ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచ్చినా పరిష్కరించలేకపోయారు. అటువంటిది.. 119 నియోజకవర్గాల్లో కట్టడి చేయగలుగుతారా’ అంటూ పలు రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న సంఘటనలను కేంద్ర ఎన్నికల కమిషనర్ బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల విధులకు నియమించాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ బృందాన్ని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై అంచనా వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో 17 మందితో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఓ హోటల్‌లో పలు రాజకీయపార్టీలకు చెందిన ప్రతినిధులతో బృందం సమావేశమైంది. బీఆర్‌ఎస్ తరఫున బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీఽధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, బీజేపీ తరఫున మర్రి శశిధర్‌రెడ్డి, పాటక్, టీడీపీ నుంచి కాసాని వీరేశ్, మజ్లిస్ నుంచి ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, సయ్యద్ ముస్తాక్ అహ్మద్, సీపీఎం నేతలు నర్సింహారెడ్డి, టి.జ్యోతి, బీఎ్‌సపీ, ఆమ్‌ఆద్మీపార్టీ తరఫున విజయార్య క్షత్రియ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల నిర్వహణ తీరును సీఈసీ బృందానికి వివరించారు. మునుగోడులో ఓటర్లకు డబ్బు అందిన తర్వాతనే ఓటు వేశారని ఆయా పార్టీల నేతలు సీఈసీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో వందల కోట్లు దొరికాయని వాటిపై ఎలాంటి శిక్షవేశారో చెప్పాలని వారు కోరారు.