తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వార్‌రూం భేటీలో ‘అమెరికా’ చిచ్చు రేగింది. అమెరికా వేదికగా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలిసింది. అత్యంత విశ్వసయనీయ సమాచారం మేరకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమక్షంలోనే రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినట్టు సమాచారం. గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి అక్కడ సుమారు 36 టికెట్లకు సంబంధించి బేరసారాలు చేశారని ఆరోపించినట్టు తెలుస్తున్నది. వారికి టికెట్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ నిర్వహించిన సర్వేలో డబ్బులు ఇచ్చిన వారిలోని కొందరు నేతలకు చోటు దక్కలేదట. రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి ఆ నేతల పేర్లు సర్వేలో ఉండేలా తెరవెనుక మాయ చేసినట్టు భేటీలో ఆరోపించడంతో రేవంత్‌రెడ్డి వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలుగా భేటీ మారిపోయిందని సమాచారం. చైర్మన్ సమక్షంలోనే ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో కేకలు వేసుకున్నట్టు తెలిసింది. ఆగ్రహించిన కమిటీ చైర్మన్ మురళీధరన్.. రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అనంతరం కమిటీ సభ్యులతో విడివిడిగా భేటీ అయినట్టు సమాచారం. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి టికెట్ల అమ్మకంపైనే ప్రధానంగా నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
మనోహర్‌రెడ్డి బహిరంగంగానే
ఢిల్లీ వార్ రూం సమావేశంలో రేవంత్‌రెడ్డిపై నేతలు చేసిన ఆరోపణలకు బలం చేకూరే ఘటనలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ బహిష్కృతనేత కొత్త మనోహర్‌రెడ్డి బహిరంగంగానే రేవంత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు. పటాన్‌చెరు టికెట్ కోసం గాలి అనిల్‌కుమార్ నుంచి రూ. 12 కోట్లు, మహేశ్వరం టికెట్ కోసం పారిజాత నుంచి రూ. 10 కోట్లు, 5 ఎకరాల భూమి, కల్వకుర్తి టికెట్ కోసం కసిరెడ్డి నారాయణరెడ్డి నుంచి రూ. 6 కోట్లు వసూలు చేసినట్టు ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేపైనా ఇక్కడి నేతలు అభ్యంతరం, అనుమానాలు వ్యక్తం చేశారు. అర్హత లేని వాళ్లకు, గెలిచేస్థాయి లేని వాళ్లకు సర్వేలో మంచిగా రిపోర్ట్ ఇచ్చారని ఆరోపించారు. స్పందించిన అధిష్ఠానం విమర్శలు వచ్చిన సుమారు 35 స్థానాల్లో రీ సర్వే చేయించింది.
కాంగ్రెస్‌లో కులాల కుంపట్లు
ఇప్పటికే విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కులాల కుమ్ములాటలు కూడా మొదలయ్యాయి. ఇప్పటి వరకు వ్యక్తులుగా విడివిడిగా ఉన్న నేతలు ఇప్పుడు కులాల వారీగా విడిపోయినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కులాల వారీగా టికెట్లు డిమాండ్ చేయడం అనుమానాలకు మరింత తావిస్తున్నది. తమకు కనీసం 34 సీట్లు ఇవ్వాలంటూ బీసీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండగా వారికి అధిష్ఠానం మొండి చేయి చూపించడం ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతున్నది. మరోవైపు ఖమ్మ సామాజిక వర్గం నేతలు కూడా తమకు కనీసం 11 సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహిళా కాంగ్రెస్ తమకు 25 సీట్లు కావాలని, యూత్ కాంగ్రెస్ ఐదు సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నది.