తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు. ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందని, ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ కోల్పోతోందని చెప్పారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుచరులు, అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది.