తెలంగాణ వీణ, సినిమా : రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ప్రముఖ నటి విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు. మరోసారి తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే మళ్లీ సినిమాలు చేయబోనని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్పిన రాములమ్మ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె తిరస్కరిస్తూ వచ్చారు. అయితే తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాకు ఆమె ఓకే చెప్పినట్టు నిర్ధారణ అయ్యింది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాల ద్వారా క్లారిటీ వచ్చింది.పూజా కార్యక్రమాలకు విజయశాంతి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లలో కూడా రాములమ్మ కనిపించడంతో మరోసారి విజయశాంతి నటించబోతున్నట్టు నిర్ధారణయ్యింది. కాగా ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉందనే వార్తలు సినీసర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కల్యాణ్ రామ్ 21వ సినిమాని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించనుంది. కాగా.. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.