తెలంగాణ వీణ , జాతీయం : రాజస్థాన్ కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే కాళ్లు మొక్కారు. బార్మర్ లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ కార్యక్రమంలో మాజీ సీఎం రాజే సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. బార్మర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మెవరమ్ జైన్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేను చూసిన జైన్.. ఆమె వద్దకు వెళ్లి కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కాగా, బీజేపీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని వసుంధరా రాజే సొంత పార్టీపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను వసుంధరా రాజే కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో వసుంధరా రాజే త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.