తెలంగాణ వీణ,సినిమా : డ్రగ్స్ కేసు విషయంలో తన ప్రమేయంపై వస్తున్న వార్తలను దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఖండించారు. గతంలో వరలక్ష్మి వద్ద పని చేసిన ఓ మేనేజర్‌ను ఇటీవల కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఆమెకు కూడా సంబంధం ఉందా అనే కోణంలో నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ‘రాజు గారి గది’ ఫేమ్ ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న ‘మాన్షన్ 24’ హారర్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఈ విషయంపై స్పందించింది. అసలు ఈ డ్రగ్స్ కేసులో తన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో తెలిపింది. ‘డ్రగ్స్ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకేం సమన్లు రాలేదు. గతంలో నా వద్ద ఓ మేనేజర్ పని చేశారు. ఆయన తీసుకొచ్చిన రెండు మూడు సినిమాలు నేను చేశాను, మా మధ్య ఉన్నది అంతే. ఆ తర్వాత ఏం జరిగిందనేది, ఆయన వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. ఆయన ఇన్వాల్వ్ అయిన కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరు, ముఖం వేసి వార్తలు రాస్తే ఎవ్వరూ చదవరు కదా? వరలక్ష్మి మేనేజర్ అంటే అంతా చూస్తారు. అందుకే నా పేరును ఇందులోకి తీసుకొచ్చారు’ అని నటి చెప్పుకొచ్చింది.