తెలంగాణ వీణ , జాతీయం : సిక్కింలో ఇటీవల ఆకస్మికంగా సంభవించిన వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆ రాష్ట్రంలో ఇంకా వరద సహాయ చర్యలు, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిక్కింలోని మంగన్ జిల్లా లాచెన్, లాచంగ్ లోయలోకి వచ్చిన మూడు వేల మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు.
తొలుత వారు కూడా గల్లంతయ్యారని భావించారు. అయితే వారంతా క్షేమంగానే ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వీరిని హెలికాప్టర్ ద్వారా తరలించడానికి ప్రయత్నించినా, వాతావరణం అనుకూలించ లేదు. కాగా, సిక్కిం వరదల్లో 55 మంది మరణించగా, అందులో 8 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇంకా 14 మంది జవాన్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. 140 మంది వరదల్లో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.