తెలంగాణ వీణ , హైదరాబాద్ : రైతులకు పంట పెట్టబడి సాయాన్ని రూ.16 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం చారిత్రాతమ్మకమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎకరానికి రూ.8 వేలతో మొదలైన రైతుబంధు సాయాన్ని రూ.10 వేలకు పెంచుకున్నామని, వచ్చే ఏడాది నుంచి రూ.12 వేలకు పెంచుతామన్నారు. క్రమంగా ప్రతీ ఏటా పెంచుతూ రూ.16 వేలు అందిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
రైతులకు పంట పెట్టుబడి కోసం స్వతంత్ర్య భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు ప్రారంభించిన సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు అని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన గొప్ప కార్యక్రమం ఇదని తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన సీఎం కేసీఆర్‌కు అన్ని జిల్లాల్లో అన్నదాతలు మద్దతు పలుకుతుండటంతో.. రానున్న ఎన్నికలలో రైతుల ఆశీర్వాదం కోరుతున్నామన్నారు.