తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్.. ప్రయాణికురాలికి తిరిగి అప్పగించింది.
వివరాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రయాణించింది. జగిత్యాల రాగానే ఆమె తన బ్యాగ్‌ను బస్సులోనే మరిచి, దిగిపోయింది. బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను మహిళా కండక్టర్ గమనించింది. ఆ బ్యాగులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికురాలికి సమాచారం చేరవేసింది.
జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను బాధిత ప్రయాణికురాలికి అప్పగించారు. కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, ప్రయాణికుల పట్ల ఇది తమ నిబద్దత అని డిపో మేనేజర్ పేర్కొన్నారు.