తెలంగాణ వీణ , హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్-సిద్దిపేట స్టేషన్ల మధ్య పూర్తయిన నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్ర ధాని మోదీ జాతికి అంకితం చేశారు. మహబూబ్‌నగర్-కర్నూల్ స్టేషన్ల మధ్య పూర్తిచేసిన విద్యుద్ధీకరణను కూడా ప్రధాని ప్రారంభించారు. కర్ణాటకలోని బీదర్ నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరపున మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. సమీకృత కలెక్టరేట్‌లో పుష్పగుచ్ఛం ఇచ్చి జిల్లాకు ఆహ్వానించారు. అనంతరం మోదీ సమీకృత కలెక్టరేట్ నుంచి రోడ్డు మార్గంలో జీజీ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వర్చువల్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) సిద్దిపేట-సికింద్రాబాద్ తొలి రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిర్మించిన 1,600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల ఫస్ట్ యూనిట్‌ను మోదీ వర్చువల్‌గా జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో రూ.516 కోట్లతో 20 క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.