తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చురేపుతున్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రకటిస్తున్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల లేదా నారాయణపేటల్లో సీటు ఆశించిన ఎర్రశేఖర్.. తనకు పోటీచేసేందుకు అవకాశం కల్పించకపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మరికాసేపట్లో తన అనుచరుగణంతో సమావేశం కానున్నారు. వనపర్తిలో చిన్నారెడ్డికి టికెట్ రావడంతో మేఘారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దేవరకద్ర టికెట్ ఆశించిన ప్రదీప్‌కుమార్ గౌడ్‌కు భంగపాటు తప్పలేదు. అక్కడ మదన్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది.
కామారెడ్డి కాంగ్రెస్‌లో అసంతృప్తి నెలకొన్నది. ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనను కాదని మదన్‌మోహన్ రావుకు అధిష్ఠానం సీటు కేటాయించడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనను గుర్తించలేదంటూ ఊగిపోతున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడులోనూ అసమ్మతి భగ్గుమన్నది. రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో.. చలమల కృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. చౌటుప్పల్‌లో నేడు తన అనుచరులతో సమావేశమవనున్నారు. నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జలో కృష్ణారెడ్డి వర్గీయులు రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హుస్నాబాద్ టికెట్ల కేటాయింపు చిచ్చురాజేసింది. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.