తెలంగాణ వీణ , జాతీయం : ఏపీలో జగన్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి, టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామంటూ బెంగళూరులోని ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతినబూనారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం బెంగళూరు మారతహళ్లిలో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో సమర శంఖారావం సభ నిర్వహించారు. ఆ సభకు బెంగళూరుతో పాటు కర్ణాటక వ్యాప్తంగా నివసించే తెలుగు ప్రజలు, అభిమానులు, మహిళలు, ఐటీ – కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆ సభలో పలువురు టీడీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి వినాశక పాలనకు చరమగీతం పాడడానికి బెంగళూరు సహా దేశ, విదేశాల్లో నివసించే తెలుగువారంతా కలసి రావాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి నీచమైన పాలన చూడలేదని చెప్పారు. జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారన్నారు.
చంద్రబాబుకు అన్యాయం జరిగిందనే కసి, కోపం ఐటీ ఉద్యోగుల్లో బలంగా ఉందని, అందుకే వేలాది మంది ఐటీ ఉద్యోగులు బెంగళూరులో సభ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జగన్ వ్యవస్థలను నాశనం చేశారని, పరిశ్రమలను తరిమేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఐటీ నిపుణులు సొంత గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయించాలని అయ్యన్న పిలుపునిచ్చారు. మరో నేత చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. చట్టంలో లొసుగుల ఆధారంగా చంద్రబాబును జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తనకున్న అవినీతి మరకను చంద్రబాబుకు అంటించే కుట్ర పన్నారన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం ముఖ్యులు కనకమేడల వీర, సోంపల్లి శ్రీకాంత్, వెంకటరత్నంతో పాటు పలువురు ఐటీ నిపుణులందరితో టీడీపీ గెలుపు కోసం పనిచేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో 30 మందికిపైగా టీడీపీ ముఖ్య నాయకులు ప్రసంగించారు.