తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ‘‘చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి.’’ అని సజ్జల దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన తప్పు మీద టీడీపీ మాట్లాడటం లేదు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ పెట్టమని అడుగుతున్నారు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారు. భోజనాన్ని కూడా జైలు అధికారులు పరీక్షించాకే అనుమతిస్తున్నారు. ప్రతీరోజూ చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అర్జంటుగా చంద్రబాబును బయటకు తీసుకొచ్చాయలన్నదే వీరి తాపత్రయం’’ అని సజ్జల ధ్వజమెత్తారు
‘‘జైలులో సకల సౌకర్యాలు ఉండాలనుకుంటున్నారు. కోర్టు చెప్పకముందే జైలు అధికారులు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అమిత్‌షా పిలిపిస్తే లోకేష్ వెళ్లాడని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అమిత్‌షాతో ఏం మాట్లాడారో తెలీదు. కానీ ఎల్లో మీడియా కథనాలు చాలానే అల్లింది. ఏ కోర్టులో ఉంది.. ఏ బెంచ్ విచారిస్తోందంటూ అడిగారంట. అమిత్‌షాతో భేటీని వీళ్లకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేశ్‌కు డబ్బులు అందాయి. పెండ్యాల శ్రీనివాస్‌కు కూడా డబ్బులు అందాయి. పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేశ్ ఇద్దరూ విదేశాలకు జంప్ అయ్యారు’’ అని సజ్జల పేర్కొన్నారు.