తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన నేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు, సంఘాల నాయకుల నుంచి అర్జీలు స్వీకరించారు. అయితే, సమస్యలకు పవన్ పరిష్కారం చూపిస్తారనో, పోరాటం చేస్తారనో ఆశించిన అర్జీదారులకు నిరాశే ఎదురైంది.టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని పవన్ ప్రతి అర్జీదారుడికి చెప్పడంతో వారంతా కంగుతిన్నారు. అటువంటప్పుడు ఇప్పుడే జనవాణి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారని పలువురు అక్కడే చర్చించుకున్నారు. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పేరును పవన్ జనవాణిలో ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నట్లుగా ఆయన వ్యవహరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, నేడు వాటిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు.