తెలంగాణ వీణ , సినిమా : ఈ వేదికపై (శిల్ప కళా వేదిక) జరిగిన వందల ఆడియో ఫంక్షన్‌లకు వచ్చాను. నా పాటలు కూడా ఆవిష్కరించబడ్డాయి. కానీ ఆ ఫంక్షన్స్‌లో హీరోలను చూసేందుకు ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ రోజు ఇక్కడ పాట హీరో.. సంగీతం హీరో.. సాహిత్యం హీరో. ‘తాజ్‌మహల్’ సినిమాతో నన్ను రామానాయుడుగారు పరిచయం చేశారు. 1995లో మొదలైన నా ప్రయాణం 2023 వరకూ.. 28 సంవత్సరాలు.. 860కి పైగా సినిమాలు.. 3600లకు పైగా పాటలు రాశాను.ఈ ఏడాది నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఈ ఏడాది నాపై పురస్కారాల వర్షం కురిసింది. ఫిబ్రవరిలో గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, క్రిటిక్స్ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, బాంబే హంగామా అవార్డు, ఉత్తమ జాతీయ గీతరచయిత అవార్డు.. ఇలా వరుసగా ఒకే సంవత్సరం నన్ను ఆరు పురస్కారాలు వరించాయి. మన తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాషా చరిత్ర ఉంది.నా మిత్రుడు ఒకరు ‘సంకల్పం’ అనే పుస్తకం తెలుగులో రాసి, ఈ పుస్తకం కోసం వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు ఆయన సహోద్యోగి ఎందుకు సెలవు పెట్టారని అడగ్గా… తెలుగు భాష పుస్తకం కోసం అని చెప్పగా.. ఆవిడ తెలుగు అంటే.. ఆ నాటు నాటు లాంగ్వేజ్ అన్నారట. ప్రపంచంలో తెలుగు అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘నాటు పాట’తో ఇది నాటు భాష అని తెలిసింది.