తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి స్కీమ్, ప్రతి ప్రాజెక్ట్ లోనూ స్కామ్ జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ ఫార్మర్ల టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే, ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ ను ఏపీ ప్రభుత్వం 2023లోనే 200, 300 శాతం అధిక ధరకు కొనడం వెనకున్న మర్మమేంటి? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వంలోని ధరలతో పోలిస్తే, నేడు జగన్ హయాంలోనే ప్రతి ట్రాన్స్ ఫార్మర్ ధర ఊహించని విధంగా ఎందుకు పెరిగింది? అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు అని సోమిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వారిలో ఒకరు అరబిందో సంస్థ యాజమాన్యమైతే, మరొకరు షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని అని తెలిపారు. ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండో సోల్ సోలార్ సంస్థ అని అన్నారు. ఇండో సోల్ సోలార్ సంస్థ వయస్సు కేవలం 18 నెలలు మాత్రమేనని, ఆ సంస్థను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి అందుకు బహుమతిగా రూ.75,706 కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టాడని సోమిరెడ్డి ఆరోపించారు. గతంలో తాము షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని బయటపెట్టామని వెల్లడించారు. “25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.58 వేలుంటే, ఈ సంవత్సరం (2023) తెలంగాణ ప్రభుత్వం రూ.79,829లకు కొంటే, జగన్ ప్రభుత్వం మాత్రం 223.98 శాతం ధర పెంచి, రూ.1,78,800లకు కొనడం దోపిడీ కాదా? 315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర చంద్రబాబు ప్రభుత్వంలో రూ.5,71,252లు ఉంటే, తెలంగాణ సర్కార్ రూ.8,60,000లకు కొంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.16,75,000లకు కొనడం కుంభకోణం కాదా? ఒకే సంవత్సరం పక్కపక్కనే ఉన్న రెండు రాష్ట్రాలు జరిపిన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోళ్లలో ఇంత వ్యత్యాసం ఎందుకుందో ముఖ్యమంత్రి చెప్పాలి. బ్లాక్ లిస్ట్ లో ఉండాల్సిన షిరిడిసాయి సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనకున్న మతలబు ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై నిజాలు నిగ్గుతేల్చడానికి హైకోర్టులో పిల్ వేశాను… త్వరలోనే ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణంపై కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించి, జగన్ రెడ్డి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతాను” అని సోమిరెడ్డి స్పష్టం చేశారు. “విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతోంది. మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టే తీరతాం. ప్రజలందరూ ఆధారపడే విద్యుత్ వ్యవహారంలో భారీ కుంభకోణాలు జరిగితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే కదా! అరబిందో, షిరిడిసాయి సంస్థలు తప్ప ఇతర కంపెనీలు లేవా? త్వరలోనే మూడు డిస్కంల పరిధిలో జరిగిన ఊహించని వ్యవహారాలను బయటపెడతాను. ఈ ప్రభుత్వంలోని కుంభకోణాలన్నీ బయటకొస్తే ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే ఉంటారు” అని సోమిరెడ్డి స్పష్టం చేశారు.