తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు టవర్ ఏసీ సదుపాయం కల్పించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాబు ఉంటున్న బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అందులో భాగంగా ఆయన గదిలో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. వాతావరణం కారణంగా బ్యారెక్‌లో ఉక్కపోతగా ఉండటంతో ఇప్పటికే తనకున్న చర్మ సమస్యల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు.
అయితే జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు జైలు నిబంధనలు అనుమతించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వైద్యుల సూచనల మేరకు తన బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ శనివారం రాత్రి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం ఆన్‌లైన్‌లో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయాధికారి రాజమండ్రి జైలు అధికారులు, వైద్యులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని వైద్యులు కోర్టుకు తెలిపారు.
న్యాయాధికారి స్పందిస్తూ.. చంద్రబాబు అభ్యర్థనపై మీరేమంటారని వివేకానందను ప్రశ్నించారు. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని వివేకానంద చెప్పారు. దీంతో న్యాయాధికారి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఎంత సేపట్లో ఏసీ సదుపాయం ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. దీన్ని న్యాయాధికారి రికార్డ్ చేశారు.