తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. ఇప్పటికే 55 మందితో మొదటి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ, ఈ రోజు మరో 45 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనుంది. మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేసే అంశాన్ని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు వదిలేశారని తెలుస్తోంది. ఇక సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే ఏయే స్థానాలు ఇవ్వాలనేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడి కానుంది.ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీ భవన్‌లో సమావేశం కానున్నారు. విజయభేరి బస్సు యాత్రపై చర్చించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక మంత్రి బోస్ రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు.ఇదిలా ఉండగా, పటాన్‌చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీలం మధు పటాన్‌చెరు టిక్కెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్‌లో టిక్కెట్ ఆశించి రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.