తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎన్నికల వేళ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా వ్యవహారం కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీలో ఉండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజల్లో ఉండి సేవ చేస్తే ఎందుకు గెలవరని ప్రశ్నించారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి కూడా 40 వేల ఓట్లతో ఓసారి, 50 వేల ఓట్లతో ఇంకోసారి ఓడిపోయారని గుర్తు చేశారు. పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారే చేయలేదని పేర్కొన్నారు. జనగామ టికెట్ కోసం ముగ్గురిని ఎంపిక చేస్తే అందులో పొన్నాల కూడా ఉన్నారని తెలిపారు. అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాకుండానే రాజీనామా చేయడం వెనకున్న కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే పార్టీని దెబ్బతీయడానికి, బలహీన పర్చడానికే ఆయన రాజీనామా చేసినట్టు ఉందని ఆరోపించారు. కార్యకర్తలకే బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజీనామాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.